డబుల్ డెక్కర్ బస్సులు ఉన్నా..లేనట్టే? ..నడుస్తున్న సంగతే తెలియదంటున్న జనాలు

డబుల్ డెక్కర్ బస్సులు ఉన్నా..లేనట్టే? ..నడుస్తున్న సంగతే తెలియదంటున్న జనాలు
  • పర్యాటక ప్రాంతాల సందర్శనకు 6 బస్సులు తెచ్చిన  హెచ్ఎండీఏ 
  • ఎక్కడెక్కడికి ఎప్పుడు తిరుగుతాయో ఎవరికీ తెలియదు 
  • ఉచిత ప్రయాణమని అవేర్నెస్​ కల్పించని ఆఫీసర్లు 
  • నెలకు రూ . కోటిన్నర ఖర్చు 
  • తమకు ఇచ్చెయ్యాలంటున్న టూరిజం శాఖ

హైదరాబాద్​సిటీ, వెలుగు: సిటీ పర్యాటక ప్రాంతాలపై ప్రచారం నిర్వహించడంతో పాటు వాటిని చూడాలనుకునేవారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడానికి హెచ్ఎండీఏ తీసుకువచ్చిన డబుల్​డెక్కర్​బస్సులు ప్రయోజనం లేకుండా పోయాయి.

జనాలకు వాటి గురించి తెలియకపోవడం, ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్తాయో అధికారులు అవగాహన కల్పించకపోవడం, ఉచితంగానే ప్రయాణించవచ్చన్న సంగతి కూడా తెలియకపోవడంతో ఎవరూ ఎక్కడం లేదు. దీంతో వాటి వల్ల ఉపయోగం లేదని టూరిజం డిపార్ట్​మెంట్​కు బదిలీ చేసే యోచనలో హెచ్ఎండీఏ ఉన్నట్టు తెలుస్తున్నది.

డబుల్​ డెక్కర్​కు ఉన్న క్రేజ్​తో.

ఒకప్పుడు హైదరాబాద్​లో ఆర్టీసీ డబుల్​డెక్కర్ బస్సులు నడిపింది. నగరానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు ఈ డబుల్​డెక్కర్​బస్సుల్లో ప్రయాణించడానికి ఎంతో ఆసక్తి చూపించే వారు. హాయిగా పైఫ్లోర్​లో కూర్చుని నగర అందాలను తిలకించడం కోసం ఆ అనుభూతిని ఆస్వాదించేందుకు ఎంతో మంది ఇష్టపడేవారు. కానీ కొన్ని కారణాలతో ఆర్టీసీ డబుల్​డెక్కర్​బస్సులను నిలిపివేసింది.

ఆనాటి అనుభూతులను మళ్లీ ఇప్పటి తరానికి అందించాలన్న లక్ష్యంతో హెచ్ఎండీఏ ఆరేండ్ల కింద మోడ్రన్​డబుల్​డెక్కర్​బస్సులను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఆకట్టుకునే డిజైన్, అద్దాలతో అందమైన బస్సులను ప్రవేశపెట్టింది. ప్రత్యేకంగా డ్రైవర్, ఇతర సిబ్బందిని కూడా నియమించుకుంది. వీటిలో నగరంలోని పర్యాటక ప్రదేశాలను ఉచితంగా సందర్శించుకునే అవకాశం కల్పించింది. 

ఒక్కో బస్సుకు రూ. 2 కోట్లు

ఒక్కో డబుల్ డెక్కర్​ బస్సుకు రూ.2 కోట్లు పెట్టిన హెచ్ఎండీఏ బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్​ (బీపీపీ) ఆధ్వర్యంలో నడిపిస్తోంది. మొత్తం ఆరు బస్సులకు రూ. 12 కోట్లు ఖర్చు చేసింది. నెలకు మెయింటనెన్స్​ రూ. కోటికి పైగానే అవుతోంది.

నెక్లెస్​రోడ్​ కేంద్రంగా హైటెక్​సిటీ రూట్​లో మూడు బస్సులను, ట్యాంక్​బండ్​నుంచి గోల్కొండ రూట్​లో రెండు బస్సులు, మరో బస్సును ట్యాంక్ బండ్​చుట్టూ సంజీవయ్య పార్కు నుంచి నెక్లెస్​రోడ్, పీపుల్స్​ప్లాజా, ఎన్టీఆర్​గార్డెన్స్, లుంబినీ పార్క్, సెక్రటేరియల్, ట్యాంక్​బండ్​మీదుగా బోట్స్​క్లబ్​ వరకూ నడుపుతున్నారు. అయితే ఈ బస్సులపై ఏ రూట్​ప్రయాణం అన్నది పేర్కొనడం లేదు.

కేవలం ఉచిత బస్సు అని మాత్రమే రాస్తున్నారు. దీంతో సందర్శకులు ఎక్కడికి వెళ్తుందో తెలియక అస్సలు ఎక్కడం లేదు. కానీ, అధికారులు మాత్రం 60 శాతం ఆక్యుపెన్సీ ఉందని చెప్తున్నారు. కానీ,  ఈ డబుల్​డెక్కర్​బస్సులు ఎక్కడ కనిపించినా లోపల పట్టుమని పది మంది కూడా ఉండడం లేదు. కొన్ని రూట్లలో అయితే ఖాళీగా తిరుగుతున్నాయి.

అలాగే ఏ స్టాప్​లో ఆపుతారో, ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో.. ఏ రూట్లలో వెళ్తున్నాయన్న విషయాన్ని కూడా ప్రచారం చేయడం లేదు. ఆర్టీసీ బస్సుల మాదిరిగా కనీసం ఎంపిక చేసిన రూట్లలో బస్​ స్టాప్​లలో ఆపినా ప్రయాణికులు ఎక్కే అవకాశం ఉండేది.

అసలు ఈ బస్సులు ఏ ఉద్దేశంతో నగరంలో తిరుగుతున్నాయో కూడా చాలా మంది తెలియదు. అయితే, బస్సులు రోజూ నడవడం లేదని, ఒకటి రెండు బస్సులు మాత్రమే కొన్ని రూట్లలో నడుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 

మాకు ఇవ్వండి : టూరిజం శాఖ

హెచ్ఎండీఏ దగ్గరున్న ఆరు డబుల్​డెక్కర్​ బస్సులతో ఉపయోగం లేదని వాటన్నింటినీ తమకు బదలాయించాలని టూరిజం శాఖ హెచ్ఎండీఏను కోరుతోంది. దీనికి సంబంధించి ఇటీవలే టూరిజం శాఖ లెటర్​కూడా రాసిందని, చర్చలు జరుగుతున్నాయని ఓ అధికారి చెప్పారు. తాము తీసుకుని తెలంగాణలోని కీలకమైన పర్యాటక కేంద్రాలకు నడపాలని అనుకుంటున్నామని టూరిజం శాఖ చెప్తోంది. ముందుగా వరంగల్​ లోని రామప్ప టెంపుల్​కు ఈ డబుల్​డెక్కర్​బస్సుల ద్వారా ప్యాకేజీ అనౌన్స్​చేసేందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. త్వరలో ఒక నిర్ణయానికి రానున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు.

అప్పట్లో ‘డబుల్ ​డెక్కర్​’ మర్చిపోలేని అనుభవం

నా చిన్నతనంలో సిటీలో డబుల్​డెక్కర్​ బస్సులు చాలా రూట్లలో తిరగడం నాకు తెలుసు. 1975 రోజుల్లో కోఠి నుంచి ప్యారడైజ్​వరకు, సికింద్రాబాద్​ నుంచి అఫ్జల్ గంజ్, చార్మినార్​ వరకూ డబుల్​డెక్కర్​బస్సులు తిరిగేవి. వీటిలో ప్రయాణించడం అంటే ఎంతో సరదాగా ఉండేది.

ఈ బస్సు ఎక్కి పైఅంతస్తులో కూర్చుని ట్యాంక్​ బండ్​ అందాలు, అబిడ్స్​, చార్మినార్​ వరకూ ప్రయాణించడం ఇప్పటికీ మర్చిపోలేను. ప్రస్తుతం నగరంలో డబుల్​ డెక్కర్​ఉందన్న  విషయం నాకు తెలియదు. ట్యాంక్​బండ్​ పరిసరాల్లో తిరుగుతుందని చెబుతున్నారు. ఇలాంటి వాటిపై జనాలకు అవగాహన కల్పిస్తే ఎక్కువ మంది ఎక్కి ఆదరణ లభించే అవకాశం ఉంటుంది. 

- కె. మురళీధర్​, అడ్వొకేట్, సికింద్రాబాద్​.

మా పేరెంట్స్​చెప్తుండే వారు

నగరంలో ఒకప్పుడు డబుల్​డెక్కర్​ బస్సులు నడిచేవని మా పేరెంట్స్​చెబుతుండే వారు. దీంతో నేను కూడా డబుల్​డెక్కర్​ఎక్కి ప్రయాణిస్తే బాగుండు కదా అనుకునేవాడిని. కానీ, మన సిటీలో కూడా డబుల్​డెక్కర్​బస్సులు తిరుగుతున్నాయని..ట్యాంక్​బండ్​, గోల్కొండ వంటి ప్రాంతాల్లో నడుస్తున్నాయని అంటున్నారు.

వాటిని గురించి నేనెక్కడా చదవలేదు. ఇప్పటి వరకూ చూసింది కూడా లేదు. నాలాంటి యూత్​అంతా డబుల్​డెక్కర్​లో జర్నీని ఎక్స్​పీరియన్స్​చేయాలని అనుకుంటున్నారు. అవి ఎక్కడెక్కడ నడుస్తాయి? ఎన్ని గంటలకు వెళ్తాయో చెప్తే బాగుంటుంది.

- కల్యాణ్​, ఓయూ స్టూడెంట్-